గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులోకి శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌

  • గాయం కార‌ణంగా ఐపీఎల్‌-2025కు దూర‌మైన గ్లెన్ ఫిలిప్స్ 
  • అత‌ని స్థానంలో ఆల్‌రౌండ‌ర్ ద‌సున్ షన‌క‌ను తీసుకున్న జీటీ
  • రూ. 75 ల‌క్ష‌ల‌కు అత‌డిని తీసుకున్న‌ట్లు వెల్ల‌డి
గాయం కార‌ణంగా ఐపీఎల్‌-2025కు దూర‌మైన కివీస్ స్టార్ ప్లేయ‌ర్ గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) మ‌రో ఆట‌గాడిని తీసుకుంది. శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ ద‌సున్ షన‌క‌ను తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రూ. 75ల‌క్ష‌లు వెచ్చించి అత‌డిని తీసుకున్న‌ట్లు తెలిపింది. 

ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ‌ తర్వాత ఫిలిప్స్ న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. జీటీ... ఐపీఎల్‌ మెగా వేలంలో ఫిలిప్స్ ను రూ. 2 కోట్లకు తీసుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కుముందు అత‌డు హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్ ఫ్రాంచైజీల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ రెండు జట్ల తరఫున క‌లిపి ఎనిమిది మ్యాచ్ లు ఆడాడు. 

ఇక‌, షన‌క‌ ఐపీఎల్‌-2023 సీజ‌న్‌లో గుజ‌రాత్ త‌ర‌ఫున ఆడిన విష‌యం తెలిసిందే. ఆ సీజ‌న్‌లో మూడు మ్యాచ్ లు ఆడి 26 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్‌లో అత‌డికి అవ‌కాశం రాలేదు. మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయ‌గ‌ల షన‌క మిడిలార్డ‌ర్‌లో త‌మ‌కు బ‌లంగా మార‌తాడని జీటీ యాజ‌మాన్యం భావిస్తోంది. 

కాగా, ఆల్ రౌండర్ అయిన షనక, శ్రీలంక తరఫున 102 టీ20ల్లో 19.67 సగటుతో 1,456 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 33 వికెట్లు తీశాడు.


More Telugu News