'నార్కోటిక్స్' రైడ్‌... హోట‌ల్ నుంచి ప‌రుగులు పెట్టిన ప్ర‌ముఖ న‌టుడు... వీడియో వైర‌ల్‌!

  • మ‌రో వివాదంలో చిక్కుకున్న న‌టుడు షైన్ టామ్ చాకో
  • కొచ్చిలోని ఓ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌నే స‌మాచారంతో నార్కోటిక్స్‌ రైడ్
  • మూడో అంత‌స్తు కిటికీ ద్వారా సెకండ్ ఫ్లోర్‌లోకి దూకిన న‌టుడు
  • ఆ త‌ర్వాత‌ మెట్ల మార్గంలో ప‌రుగులు పెట్టిన వైనం
  • ఇప్ప‌టికే చాకోపై న‌టి విన్సీ అలోషియస్ కేర‌ళ ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో ఫిర్యాదు
ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. కొచ్చిలోని ఓ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌నే స‌మాచారంతో నార్కోటిక్ సిబ్బంది రైడ్ చేయ‌గా ఆయ‌న పారిపోయారు. మూడో అంత‌స్తు కిటికీ ద్వారా సెకండ్ ఫ్లోర్‌లోకి దూకి మెట్ల మార్గంలో ప‌రుగులు పెట్టారు. బుధవారం రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఆ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

కాగా, ఎర్నాకుళం జిల్లాలోని ఒక హోటల్‌లో జిల్లా నార్కోటిక్ నిరోధక ప్రత్యేక దళం (DANSAF) ప్రత్యేకంగా చాకోను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు నిర్వహించింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు చాకో త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని విన్సీ అలోషియస్ అనే న‌టి మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA)లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. 

ఆయ‌న‌ డ్రగ్స్ మ‌త్తులో ఉన్నప్పుడు త‌న‌తో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. ఈ సంఘటన 'సూత్రవాక్యం' సినిమా షూటింగ్ సమయంలో జరిగిందని విన్సీ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వివరణాత్మక వీడియోను షేర్ చేశారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత నుంచి తాను ఇకపై మాదకద్రవ్యాలు ఉపయోగించే నటులతో న‌టించ‌కూడద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ఆమె వీడియోలో తెలిపారు.    

కాగా, షైన్ టామ్ చాకో టాలీవుడ్‌లోకి నేచుర‌ల్ స్టార్‌ నాని 'దసరా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా ఆయ‌న‌ పెర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత చాకో రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో అతడిపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.




More Telugu News