బాణసంచా పేలి ఆరుగురి మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

  • అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
  • ఆరుగురి దుర్మరణం
  • వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు
  • ఎప్పటికప్పుడు తనకు నివేదిస్తుండాలని ఆదేశాలు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 

అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని సీఎం ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఘటనపై విచారణ చేసి తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అత్యవసరమైన అన్ని రకాల వైద్య సేవలు బాధితులకు అందేలా చూడాలని, బాధితుల ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 


More Telugu News