విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ వీడియోతో హైద‌రాబాద్ పోలీసుల ఇంట్రెస్టింగ్ పోస్ట్‌!

  
టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోతో హైద‌రాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. త‌మ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఇక వీడియోలో ర‌న్ మెషీన్ త‌ల‌కు ధ‌రించిన హెల్మెట్‌కు అవ‌త‌ల వైపు నుంచి బౌల‌ర్ విసిరిన బంతి బ‌లంగా తాకడం ఉంది. ఈ సంద‌ర్భాన్ని ట్రాఫిక్‌ పోలీసులు ప్రాణాలు కాపాడ‌టంలో హెల్మెట్ ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేయ‌డానికి వాడుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 

"మీ త‌ల‌లో విడిభాగాలు లేవు. అది మైదానం అయినా, రోడ్ అయినా... హెల్మెట్ ఆప్ష‌న‌ల్ కాదు... బ‌త‌కడానికి అవ‌స‌రం" అని ప్ర‌మాదంలో త‌ల‌కు గాయ‌మైతే బ‌తికించ‌డం క‌ష్టం అనే అర్థం వ‌చ్చేలా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు త‌మ పోస్టులో రాసుకొచ్చారు. రోడ్డుపై ప్ర‌యాణించే వాహ‌న‌దారులు ఈ విష‌యాన్ని త‌ప్ప‌కుండా పాటించాల‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌జ‌ల్లో రోడ్డు ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న క‌లిగించ‌డానికి చేసిన ఈ ప్ర‌య‌త్నంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.  


More Telugu News