సన్ రైజర్స్ వరుస ఓటములపై అంబటి రాయుడు కామెంట్

  • వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయిన సన్ రైజర్స్
  • మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్లు సన్ రైజర్స్ లో లేరన్న రాయుడు
  • సమర్థులైన బౌలర్లను గుర్తించాలని సలహా
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ జట్టు బౌలింగ్ బలహీనతేనని మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్లే హైదరాబాద్ జట్టు పదే పదే ఓటమిపాలవుతోందని అన్నాడు. 

నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యంతో 152 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించలేకపోయింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, రూథర్‌ఫోర్డ్ విజృంభించడంతో హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రాయుడు మాట్లాడుతూ... మిడిల్ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్ చేయగల ఆటగాళ్లు హైదరాబాద్ జట్టులో కనిపించడంలేదని విమర్శించారు. 

గుజరాత్ జట్టులో సాయి కిషోర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టును దెబ్బతీస్తున్నారని గుర్తు చేశాడు. హైదరాబాద్ బౌలర్లు మాత్రం వికెట్లు తీయడానికి ప్రయత్నించకుండా, కేవలం పరుగులను నియంత్రించడానికి మాత్రమే చూస్తున్నారని, ఈ వ్యూహంతో విజయాలు సాధించడం కష్టమని రాయుడు స్పష్టం చేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంపై దృష్టి సారించి, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల బౌలర్లను గుర్తించాలని రాయుడు సలహా ఇచ్చాడు.


More Telugu News