గుజ‌రాత్ యువ ఆట‌గాడితో హార్దిక్ వాగ్వాదం.. మ్యాచ్ అనంత‌రం హ‌గ్ ఇచ్చిన వైనం!

  • అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఎంఐ, జీటీ మ్యాచ్‌
  • బాహాబాహీకి దిగిన హార్దిక్‌, సాయి కిశోర్‌
  • యువ ఆట‌గాడిపై నోరు పారేసుకున్న ముంబ‌యి సార‌థి
  • మ్యాచ్ అనంత‌రం ఆలింగ‌నం చేసుకుని వివాదానికి తెర‌
అహ్మ‌దాబాద్ వేదిక‌గా శ‌నివారం జ‌రిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)ను గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) 36 ప‌రుగుల తేడాతో ఓడించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబ‌యి కెప్టెన్ హార్దిక్ పాండ్య‌, గుజ‌రాత్ యువ ఆట‌గాడు సాయి కిశోర్ మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండేళ్ల కింద ఒకే జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన ఈ ఇద్ద‌రూ ఇప్పుడు ప్ర‌త్య‌ర్థులుగా మైదానంలో బాహాబాహీకి దిగ‌డం గ‌మ‌నార్హం. 2022, 2023 సీజ‌న్ల‌లో ఇద్ద‌రు జీటీకి ఆడిన విష‌యం తెలిసిందే. పాండ్య సార‌థ్యంలోనే సాయి కిశోర్ ఆడాడు.

అస‌లేం జ‌రిగిందంటే...
మొద‌ట బ్యాటింగ్ చేసిన శుభ్‌మన్ గిల్ సార‌థ్యంలోని జీటీ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఎంఐకి 197 ప‌రుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఇక ల‌క్ష్య చేధ‌న‌లో ముంబ‌యి పూర్తి ఓవ‌ర్లు ఆడి 6 వికెట్ల‌కు 160 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో 36 ప‌రుగుల తేడాతో ఓట‌మి చ‌విచూసింది. అయితే, ముంబ‌యి ఇన్నింగ్స్ లో 15వ ఓవ‌ర్‌ను సాయి కిశోర్ వేశాడు. ఆ స‌మ‌యంలో ముంబ‌యి కెప్టెన్ హార్దిక్ పాండ్య క్రీజులో ఉన్నాడు. బౌల‌ర్ డాట్ బాల్ వేయ‌డంతో పాండ్య‌కు అస‌హ‌నం వ‌చ్చింది. 

సాయి కిశోర్‌కు ద‌గ్గ‌ర‌గా వెళ్లి అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డం, దాని తాలూకు వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో వైర‌ల్‌గా మారాయి. సాయి కిశోర్ మాత్రం అలాగే చూస్తూ ఉండిపోడం వీడియోల్లో ఉంది. ఆ త‌ర్వాత అంపైర్లు క‌ల‌గ‌జేసుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు. ఇక మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ప్లేయ‌ర్లంద‌రూ క‌ర‌చాల‌నం చేసుకుంటూ వెళుతున్న స‌మ‌యంలో సాయి కిశోర్‌కు హార్దిక్ పాండ్య షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డంతో పాటు హ‌గ్ చేసుకున్నాడు. ఇద్ద‌రు చివ‌రికి హ‌గ్‌తో వివాదానికి తెర‌దించారు.


More Telugu News