: నేడు అంతరిక్షంలోకి మరో చైనా మహిళ
అంతరిక్షంలో పరిశోధనలకు అమెరికా, రష్యా దేశాలు పోటీలు పడుతుంటాయి. అయితే ఈ దేశాలకు దీటుగా చైనా కూడా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా ఒక వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ వ్యోమనౌకలో వాంగ్ యాపింగ్ అనే ఒక మహిళా వ్యోమగామిని కూడా అంతరిక్షంలోకి చైనా పంపనుంది. కాగా చైనా నుండి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగాముల్లో ఈమె రెండవది.
చైనా అంతరిక్షంలో థియాన్‌గాంగ్-1 అనే పేరుతో ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా షెంజువో-10 అనే అంతరిక్ష నౌకను ఈ రోజు సాయంత్రం అంతరిక్షంలోకి పంపనుంది. ఇందులో వాంగ్ యాపింగ్‌తోబాటు మరో ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఆకాశంలోకి ఎగరనున్న ఈ అంతరిక్ష నౌక ప్రధాన లక్ష్యం థియోన్‌గాంగ్-1 అంతరిక్ష కేంద్రంలో రెండు అనుసంధాన (డాకింగ్) పరీక్షలు చేయడం. వీటితోబాటు ధియోన్‌గాంగ్-1 నుండే చైనాలోని కళాశాల విద్యార్ధులకు వాంగ్ యాపింగ్ శాస్త్ర పాఠాలు కూడా చెప్పనున్నారు.
కాగా అమెరికా, రష్యా దేశాలు సంయుక్తంగా అంతరిక్షంలో నిర్మించిన 'మిర్' అంతరిక్షకేంద్రం సేవలు 2020 నాటికి పూర్తవుతాయి. అప్పటికల్లా తన థియోన్‌గాంగ్-1 సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలన్నది చైనా లక్ష్యం. అంతరిక్షంలోకి చైనా నుండి వెళ్లిన మహిళల్లో వాంగ్ రెండవది. ఈ అవకాశం గత ఏడాదిలోనే అందినట్టే అంది చేజారింది. గత ఏడాది అంతరిక్ష యాత్రలో వాంగ్‌కు దక్కాల్సిన అవకాశం మరో మహిళకు దక్కింది. రెండవసారి వాంగ్‌ను అవకాశం వరించింది. చైనా నుండి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగాముల్లో రెండవ వ్యక్తి అయిన వాంగ్ తూర్పు చైనాలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు.