నేటి నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?

  • నేటి నుంచి ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ
  • తొలి మ్యాచ్‌లో తలపడనున్న పాకిస్థాన్-న్యూజిలాండ్
  • మధ్యాహ్నం 2.30 గంటలకు కరాచీ వేదికగా మ్యాచ్ ప్రారంభం
  • ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 1 లైవ్, స్పోర్ట్స్ 18 ఖేల్, జియోహాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. 8 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ట్రోఫీ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1996 తర్వాత పాకిస్థాన్‌లో ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. 

 చాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ఇందులో భాగంగా తొలి రౌండ్‌లో 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత నాకౌట్ దశ ఉంటుంది. మినీ వరల్డ్ కప్‌గా భావించే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. కరాచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఈ నెల 23న భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

గ్రూప్-ఎలో భారత్‌తోపాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ఉండగా, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఇక ప్రతి జట్టును గాయాల బెడద వేధిస్తోంది. అయినప్పటికీ ఉత్తమ ఆటగాళ్లతోనే ఆయా జట్లు బరిలోకి దిగుతున్నాయి. నాణ్యమైన ఆటగాళ్లు ప్రతి జట్టులోనూ ఉన్నారు. 

మ్యాచ్‌లను ఎలా వీక్షించాలి?
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగే 15 మ్యాచ్‌లు ఒకే సమయానికి అంటే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. ‘స్టార్ స్పోర్ట్స్ 2’, ‘స్టార్ స్పోర్ట్స్ 2హెచ్‌డీ’, ‘స్పోర్ట్స్ 18 1 లైవ్’, ‘స్పోర్ట్స్ 18 1 హెచ్‌డీ’, ‘స్పోర్ట్స్ 18 ఖేల్’ చానల్స్’ ద్వారా ఇండియాలో ఈ మ్యాచ్‌ను వీక్షించవచ్చు. అలాగే, ‘జియోహాట్ స్టార్’ యాప్, వెబ్‌సైట్‌లోనూ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లలో శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ మహ్మద్ సిరాజ్ ఉన్నారు. 


More Telugu News