: అద్వానీ రాజీనామా ఎందుకు చేసారు?
బీజేపీలో సంక్షోభం ముదిరింది. ఆ పార్టీ సీనియర్ నేత రాజకీయ కురువృద్ధుడు అద్వానీ జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ బోర్డు, ప్రచార కమిటీ బాధ్యతలు వంటి పదవులన్నింటికీ రాజీనామా చేస్తూ రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాసారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ను కలుసుకున్న ఆయన అనారోగ్య కారణాలతో గోవాలో జరిగిన పార్టీ సమావేశాలకు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. అనంతరం తాను పార్టీలో నిర్వర్తిస్తున్న బాధ్యతలన్నింటినుంచీ వైదొలుగుతున్నట్టు లేఖ అందజేసారు.
అద్వానీ రాజీనామా లేఖలో 'రాజకీయాలు మారుతున్నాయి', 'ప్రస్తుతం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారే పరిస్తితులు తలెత్తుతాయి,. అదీ కాక 'పార్టీ ఆవిర్భావం నాటి సిద్దాంతాల నుంచి పార్టీ దూరం జరిగినట్టు నాకన్పిస్తోంది'. 'అందుకే మనస్థాపం చెందుతున్నాను ఈ నా లేఖను రాజీనామా పత్రంగా భావించగలరు' అంటూ లేఖను ముగించారు.
'అద్వానీ.. అంటే బీజేపీ. బీజేపీ అంటే అద్వానీ' అదీ ఆయనకు, బీజేపీకి ఉన్న బంధం. అద్వానీని తలదన్నే నేత బీజేపీలో లేడన్నది నిర్వివాదాంశం. అంతా తానై, అన్నీ తానై పార్టీని నడిపించిన ఏకైక వ్యక్తి అద్వానీ. అసలు బీజేపీ అవిర్భావం గురించి తెలియని చాలామంది బీజేపీ వ్యవస్థాపకుడు అద్వానీయే అని కూడా అంటారు. నవంబర్ 8, 1927లో పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలోని కరాచీలో జన్మించిన లాల్ కృష్ణ అద్వానీ, 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
అనంతరం జనసంఘ్ లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన అద్వానీ, ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీగా మారిన జనసంఘ్ లో ప్రధాన నాయకుడిగా ఎదిగారు. అనంతర పరిణామాలతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ వ్యవస్ధాపకులలో ఒకడిగా బీజేపీ కీలక నాయకుడిగా పార్టీని ఒంటిచేత్తో నడిపించారు. బీజేపీ ప్రస్థానం ప్రారంభం నుంచి నేటి వరకూ అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నేత అద్వానీయే అంటే అతిశయోక్తి కాదు. తొలి నాళ్లలో వాజ్ పేయి, రాజ్ నాధ్ సింగ్, మురళీ మనోహర్ జోషి వంటి రాజకీయ దిగ్గజాలతో ఏ విధమైన సిద్దంత విభేదాలు లేని అద్వానీ తాజాగా సిద్దాంతాలు మరుగున పడుతున్నాయన్న ఆవేదనతో రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.
మోడీ దూకుడును మొదటి నుంచీ అద్వానీ వ్యతిరేకిస్తున్నారు. మోడీపై గుజరాత్ అల్లర్ల ఆరోపణ చెలరేగినప్పుడే మోడీని కాస్త ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. అనంతరం మోడీ నాయకత్వ లక్షణాలని మెచ్చుకున్నా, కొన్ని నిర్ణయాలపైనా, ఆయన వ్యాఖ్యలపైనా మండిపడేవారు. పలుమార్లు అసహనం వ్యక్తం చేసారని కూడా తెలుస్తోంది.
అయితే, తాజగా మోడీకి ప్రచారబాధ్యతలను కట్టబెట్టడం అంత మంచి ఆలోచన కాదని, దాని వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని అద్వానీ మనసులో మాటను పలు సందర్భాల్లో బయటపెట్టారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు మోడీకి ప్రచారబాధ్యతలు కట్టబెట్టడంపై అద్వానీ కినుక వహించారు. అయితే, అద్వానీ రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు ఊహించకపోవడం బీజేపీ పుట్టిమునిగే పరిస్థితిని సూచిస్తోంది. అందుకే, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టింది పార్టీ అగ్రనాయకత్వం. అందుకే, అద్వానీ రాజీనామాను తిరస్కరించడం జరిగింది. అయితే ఇక ఇప్పుడు అద్వానీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తి కలిగిస్తున్న అంశం!