148 ఏళ్లలో తొలిసారి.. బ్యాట్‌తో టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ బౌలర్లు!

  • ముల్తాన్ వేదిక‌గా విండీస్‌, పాక్ మ‌ధ్య తొలి టెస్టు
  • 127 పరుగుల తేడాతో విజ‌యం సాధించిన పాకిస్థాన్‌
  • ఘోర పరాజయం ఎదురైనప్పటికీ రికార్డు సృష్టించిన‌ విండీస్‌ బౌలర్లు మోటీ, వారికన్, సీల్స్
  • ఈ ముగ్గురూ ఇన్నింగ్స్ ఆఖ‌రులో బ్యాటింగ్‌కు దిగి అత్య‌ధిక స్కోర్లు న‌మోదు చేసిన వైనం
  • ఆఖ‌రి ముగ్గురు బ్యాట‌ర్లు ఒక ఇన్నింగ్స్‌లో జట్టుకు అత్యధిక స్కోర్లు న‌మోదు చేయ‌డం ఇదే మొద‌టిసారి
ముల్తాన్ వేదిక‌గా జరిగిన మొదటి టెస్ట్‌లో వెస్టిండీస్‌పై ఆతిథ్య‌ పాకిస్థాన్‌ 127 పరుగుల తేడాతో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే, ఘోర పరాజయం ఎదురైనప్పటికీ వెస్టిండీస్ బౌలర్లు గుడాకేశ్‌ మోటీ, జోమెల్ వారికన్, జేడెన్ సీల్స్ మాత్రం ఈ మ్యాచ్ ద్వారా అరుదైన‌ రికార్డు సృష్టించారు. కానీ, బంతితో కాదండోయ్‌. బ్యాట్‌తో. అవును మీఉ విన్న‌ది నిజ‌మే. ఈ ముగ్గురూ ఇన్నింగ్స్ ఆఖ‌రులో బ్యాటింగ్‌కు దిగి అత్య‌ధిక స్కోర్లు న‌మోదు చేశారు. 

టాప్ ఆర్డ‌ర్‌, మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు పేక మేడ‌ల్లా కుప్ప‌కూలిన తొలి ఇన్నింగ్స్‌లో టైలెండ‌ర్లు మోటీ, వారిక‌న్‌, సీల్స్ ఇలా అత్య‌ధిక స్కోర్లు న‌మోదు చేసి, 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. 1877 మార్చిలో జ‌రిగిన‌ మొదటి టెస్ట్ మ్యాచ్ త‌ర్వాత ఇలా ఆఖ‌రి ముగ్గురు బ్యాట‌ర్లు ఒక ఇన్నింగ్స్‌లో జట్టుకు అత్యధిక స్కోర్లు  న‌మోదు చేయ‌డం ఇదే మొద‌టిసారి. 

మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ 66/8 వద్ద ఉన్న స‌మ‌యంలో వారి నంబర్ 9, 10, 11 బ్యాటర్ల కారణంగా చివరికి 137 పరుగులు చేయగలిగింది. 9వ స్థానంలో వచ్చిన‌ మోటీ 19, 10వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగిన‌ వారికన్ 31, 11వ స్థానంలో క్రీజులోకి వ‌చ్చిన‌ సీల్స్ 22 ప‌రుగులు చేశారు.

ఇక మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న మరే ఇతర బ్యాటర్ కూడా 11 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో మూడు అత్యధిక స్కోర్లు చివరి ముగ్గురు బ్యాటర్ల నుండి రావడం ఇదే మొదటిసారి. అలాగే టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో టాప్ 2 పరుగులు చేసిన ఆటగాళ్లు చివరి ఇద్దరు బ్యాటర్లు కావడం ఇది మూడోసారి మాత్రమే.

అయితే, రెండవ ఇన్నింగ్స్‌లో ఈ ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. వెస్టిండీస్ 123 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 127 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. కాగా, జనవరి 25న ముల్తాన్‌లోనే పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.


More Telugu News