: బీజేపీ ప్రచార సారథి మోడీయే


వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథిగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. గోవాలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రాజ్ నాథ్ ఈ ప్రకటన చేశారు. దీంతో, బీజేపీలో మోడీ శకం ఆరంభమైనట్టే అని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ నేత అద్వానీ సమావేశాలకు డుమ్మాకొట్టినా కూడా బీజేపీ అధినాయకత్వం మాత్రం భవిష్యత్ పైనే దృష్టి సారించింది. అద్వానీ డిమాండ్లను తోసిరాజంటూ మోడీవైపే మొగ్గు చూపింది. కాగా, బీజేపీలో ఓ బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఈ స్థాయికి ఎదగడం ఇదే ప్రథమం.

మోడీని ప్రచార కమిటీ చైర్మన్ గా కాకుండా కన్వీనర్ గా ప్రకటిస్తే తనకేమీ అభ్యంతరం లేదని అద్వానీ నిన్న పార్టీకి సూచించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అద్వానీకి తాజా పరిణామం మింగుడుపడని అంశమే. కాగా, మోడీ పేరు ప్రకటించకముందు సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించాలని కోరుతూ బీజేపీపై ఒత్తిడి తీవ్రతరం అయింది. నేటితో పనాజీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్రమోడీ పేరు ప్రకటించే విషయంలో ఆలస్యం చేయవద్దంటూ ఆర్ఎస్ఎస్ కోరింది. అలాగే, గుజరాత్ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కూడా మోడీ పేరు ప్రకటించాలని కార్యవర్గ సమావేశాలలో బహిరంగంగానే గళమెత్తారు.

వాస్తవానికి అధ్యక్షుడు రాజ్ నాథ్ సహా చాలా మంది మోడీ కి సానుకూలంగానే ఉన్నారు. అయితే, మోడీ పేరు ప్రకటిస్తే మిత్రులు దూరమయ్యే ప్రమాదముందంటూ అద్వానీ వ్యతిరేకించారు. ఇదే కారణంతో ఆయన బీజేపీ చరిత్రలో తొలిసారి పార్టీ కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఓ దశలో పార్టీ మాజీ అధ్యక్షుడు గడ్కరీ పేరు తెరపైకి వచ్చింది.

  • Loading...

More Telugu News