: 'థాయ్ లాండ్ ఓపెన్'లో గుంటూరు 'మిరపకాయ్' సంచలనం
అంతర్జాతీయ క్రీడాయవనికపై మరో తెలుగుతేజం తళుకులీనింది. గుంటూరు జిల్లాకు చెందిన కె. శ్రీకాంత్ (20) ప్రతిష్ఠాత్మక థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా అవతరించాడు. బ్యాంకాక్ లో ఈ ఉదయం జరిగిన ఫైనల్లో శ్రీకాంత్ 21-16, 21-12తో థాయ్ లాండ్ క్రీడాకారుడు 8వ సీడ్ బూన్సాక్ పోన్సానాను వరుస గేముల్లో మట్టికరిపించాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ 13వ సీడ్ గా బరిలో దిగడం గమనార్హం. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన ఈ తెలుగు ఆశాకిరణం.. టైటిల్ ప్రస్థానంలో తనకన్నా మెరుగైన ర్యాంకర్లను చిత్తు చేయడం విశేషం. కాగా, ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే.