: గోవాలో 'నమో'నిటీస్ వ్యాపించిందట!
గోవాలో ఇప్పుడు ఓ కొత్త వైరస్ వ్యాపించిందట. దీని పేరు 'నమోనిటీస్'! ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అట. ప్రజలు జాగ్రత్తగా వుండాలట. ఈ మాటలు అంటున్నది ఎవరో డాక్టర్లు కాదు ... కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండు రేణుకా చౌదరి! గోవాలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ సమావేశాల పోకడ గురించి రేణుక విసురుతున్న వ్యంగ్యోక్తులివి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ సీనియర్ నేత అద్వానీ వ్యతిరేకిస్తున్నారన్న వార్తలు రావడంతో, నిన్న ఢిల్లీలో అద్వానీ ఇంటి ముందు భాజపా కార్యకర్తలు అద్వానీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుక తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోడీ ఫ్యాన్స్ రెచ్చిపోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. పార్టీలో 'మోడీయిజం' రౌడీయిజానికి దిగుతోందని ఆమె విమర్శించారు. ఆ సందర్భంగానే ఆమె 'నమోనిటీస్' అనే పదాన్ని సృష్టించి మోడీ మద్దతుదారులకు చురకంటించారు. ఇంతకీ ... ఈ నమోనిటీస్ లో 'నమో' అంటే 'నరేంద్ర మోడీ' అని అర్ధం. మోడీ గారిని ఆయన మద్దతుదారులు ముద్దుగా ఇలా షార్ట్ కట్ లో 'నమో' అని పిలుచుకుంటారు!