: అవ్వల ఆరోగ్యమే మనవల ఆరోగ్యం...!
ఏంటిది... అవ్వలు ఆరోగ్యంగా ఉంటే మనవలు ఆరోగ్యంగా ఎలా ఉంటారు? అని మీకు సందేహం కలిగింది కదూ...! అయినా ఇది నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. అవ్వలు అనారోగ్యానికి గురై ఉంటే వారి అనారోగ్య సమస్యలు తమ కుమారులకు రాకుండా మనవళ్లకు వస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్థూలకాయం వల్ల ఏర్పడే ఆనారోగ్య సమస్యలు తమ తర్వాత తరాల వారికి కాకుండా వారి తర్వాత తరాల వారికి సంక్రమిస్తాయని వారు చెబుతున్నారు. అంటే తల్లులు స్థూలకాయులైయుంటే వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వారి మనవళ్లకు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థూలకాయులకు ప్రధానమైన సమస్య మధుమేహం. ఒకమాదిరి లావుగా ఉండే తల్లులు కూడా వారి మనవళ్ళ బరువు, మధుమేహం వంటి వాటిని ప్రభావితం చేస్తారని ఈ పరిశోధనలో తేలింది. శాస్త్రవేత్తలు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఇలాంటి సమస్యలు తొలితరంలో కనిపించిన తర్వాత మూడవ తరంలో కనిపించాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది? అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదని వారు చెబుతున్నారు. కాబట్టి మనవళ్లు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే... బామ్మలు చక్కటి ఆరోగ్యంతో ఉండాలి...!