: మనకన్నా ఈ బిచ్చగాడే నయం...!
మనకన్నా భిక్షగాడే నయం... ఎందుకంటే పొద్దస్తమానం కష్టపడి మనం సంపాదించే సంపాదనకన్నా ఏ పనీచేయకుండా 'ఈ' భిక్షగాడు మనకన్నా ఎక్కువే సంపాదించేస్తున్నాడు. అందుకే మనకన్నా యాచకవృత్తితో జీవించే సైమన్రైట్ నయం. బ్రిటన్లోని ఉద్యోగస్తుల సగటు వేతనం ఏడాదికి 26 వేల పౌండ్లు. ఒకవేళ అత్యంత ఉన్నత ఉద్యోగంలో ఉన్నా కూడా వారి సగటు వేతనం 40 వేల పౌండ్ల వరకు ఉంటుంది. అయితే సైమన్ ఏడాది సగటు సంపాదన 50 వేల పౌండ్లు. అంటే మన లెక్కల్లో సంవత్సరానికి అతని సగటు ఆదాయం రూ.42 లక్షలు. ఈ రకంగా చూస్తే 37 ఏళ్ల సైమన్ అత్యంత ధనవంతుని కింద లెక్క. అయితే అతని వృత్తి మాత్రం యాచకవృత్తి. అంతేకాదు... ఈ యాచకరాజు రెండున్నర కోట్ల విలువచేసే సొంత ప్లాటులో రాజభోగాలు అనుభవిస్తూ యాచకునిగా జీవిస్తున్నాడు.
లండన్లోని హైస్ట్రీట్లో సైమన్ రైట్ వచ్చే పోయే వారిని తన మాటలతో నమ్మిస్తాడు. అతని ఆహార్యం అతుకులతో కూడిన దుస్తులు, దీనికితోడు ఒక పెంపుడు కుక్కను తన వెంటేసుకుని రోడ్లపై నిలబడతాడు. తనకు నిలువ నీడలేదని, ఆకలేస్తోందని దీనంగా అడుక్కుంటాడు. మరి ఇలాంటి అవతారం చూస్తే ఎవరికైనా జాలి కలుగకుండా ఉండదు. దీంతో చక్కగా వారి జేబులోంచి డబ్బు తీసి సైమన్ చేతిలో పెడతుంటారు. ఈవిధంగా సైమన్ రోజుకు రూ.15 వేలు దాకా సంపాదిస్తాడు. అయితే తనకు వచ్చిపడే చిల్లర డబ్బులను మార్చుకోవడానికి పాపం ఆయన చాలా కష్టపడాల్సి వస్తుందట... రోజూ సంచుల్లో చిల్లర నాణేలను బుక్షాపుల్లోను, బేకరీల్లోను ఇచ్చి వాటిని నోట్లుగా మార్చుకోవడం చూసినవారు సైమన్పై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిల్లరలాగితే నోట్లు బయటపడ్డట్టు సైమన్ ఆస్థి వ్యవహారం మొత్తం బయటపడింది. ఇంకేం... పోలీసులు సదరు యాచకరాజును పట్టుకుని కోర్టుకు తీసుకెళ్లారు. భిక్షమెత్తుతూ ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నట్టు ఆయనగారు అంగీకరించడంతో కోర్టు అతనిపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. అంతేకాదు... లండన్ పరిసరాల్లో ఇకపై అడుక్కోరాదని, పట్నీ స్ట్రీట్లో కనిపించరాదని ఆదేశించింది.