: ధిక్కార ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీల విప్ లను ధిక్కరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ మొత్తం 15 మంది శాసనసభ్యులపై అనర్హత వేటువేశారు. వీరి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేశారు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా వీరందరూ తమ పార్టీల విప్ లను తోసిరాజని స్వప్రయోజనాలకు అనుగుణంగా ఓటేశారు. ఈ విషయమై ఆయా పార్టీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. దీంతో, ఈ విషయమై సభాపతి మనోహర్ విచారణ చేపట్టారు. సదరు అసమ్మతి ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు.
అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలలో టీడీపీకి చెందిన కొడాలి నాని (గుడివాడ), వనిత (గోపాలపురం), సాయిరాజ్ (ఇచ్ఛాపురం), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్ళపల్లె), అమరనాథ్ రెడ్డి (పలమనేరు).. కాంగ్రెస్ కు చెందిన ఆళ్ళ నాని (ఏలూరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), జోగి రమేశ్ (పెడన), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పేర్ని నాని (మచిలీపట్నం), రాజేశ్ (చింతలపూడి), శివప్రసాద్ రెడ్డి (దర్శి), సుజయ రంగారావు (బొబ్బిలి), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) ఉన్నారు.
ఇక చిన్నం రామకోటయ్య, వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.