: వృథాపోతున్న సల్మాన్ స్వచ్ఛంద సేవలు
మహారాష్ట్రలో గత 40 ఏళ్ళలో కనీవినీ ఎరుగని రీతిలో నీటి కరవు ఏర్పడడం పట్ల బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పెద్ద మనసుతో స్పందించిన సంగతి తెలిసిందే. కరవు పీడిత ప్రాంతాల్లో పంపిణీ చేయండంటూ 200 నీటి నిల్వ ట్యాంకులను సర్కారుకు అందించారు. అయితే, ఇప్పుడవన్నీ బీడ్ జిల్లా నీటిపారుదల శాఖ సబ్ ఇంజనీర్ కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి.
సల్మాన్ ఆధ్వర్యంలోని 'బీయింగ్ హ్యూమన్' ఫౌండేషన్ బీడ్ జిల్లా వ్యాప్తంగా మే6 నుంచి తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగానే నీటి నిల్వ ట్యాంకులను కూడా పలు గ్రామాలకు అందించాలని సల్మాన్ నిర్ణయించారు. కానీ, అధికారుల నిర్లక్ష్యం మూలంగా అది కార్యరూపం దాల్చలేదు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ బీఎం కాంబ్లే స్పందించారు. త్వరలో వర్షాకాలం సమీపిస్తుండడంతో.. అప్పటికల్లా గ్రామాలకు నీటి నిల్వ ట్యాంకులు పంపిణీ పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.