: ప్రకృతి ప్రకోపానికి రైతులు విలవిల


ప్రకృతి కన్నెర్ర జేసింది. ఫలితంగా అకాల వర్షాలతో రాష్ట్ర రైతులు, ప్రజలపై ప్రభావం పడింది. ముఖ్యంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాలలో వేలాది ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది.

వడగళ్ల వానలకు పొలాల్లోని పత్తి, మిర్చి, వేరుశెనగ పంటలు నీట మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు పంటలు నేలరాలాయి. పలు చోట్ల చెట్లు కూలడం, విద్యుత్ తీగలు తెగిపోవడంతో సాధారణ జనజీవనానికి విఘాతం కలిగింది. 


ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, ప్రకాశం, ఆదిలాబాద్ తదితర జిల్లాలలోనూ వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి వాతావరణ మార్పుల వల్ల ఈ నెల 15, 16 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని నాలుగు రోజుల కిందటే వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే.
 
అకాల వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ పరిధిలో రైలు పట్టాలు దెబ్బతిని రాకపోకలకు విఘాతం కలిగింది. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి మరమ్మతులు చేశారు. మరోవైపు భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. యంత్రాలు, వాహనాలు నిలిచిపోయాయి. 

  • Loading...

More Telugu News