: ఊహించినట్టుగానే ... సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ!
సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయన అందుకున్నారు. మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మరలా మహారాష్ట్రకు బదిలీ ఆయ్యారు. ఈసారి ముంబై క్రైంబ్రాంచ్ చీఫ్ గా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. సవాళ్లను ఇష్టంగా స్వీకరించే లక్ష్మీనారాయణ మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారిన మాఫియా, ముఠా నేరాలను అదుపు చేసేందుకు నియమితులైనట్టు తెలుస్తోంది.
కాగా, జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ లో మూడు కీలక కేసులను దర్యాప్తు చేసారు. ఎమ్మార్ కుంభకోణం, గాలి జనార్ధన రెడ్డి, ఓబుళాపురం గనులు, గాలి బెయిలు కేసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కుంభకోణం దర్యాప్తును జేడీ చేపట్టారు. ఈ మూడు కేసుల్లోనూ దేశం నివ్వెరపోయే విధంగా అక్రమాలను వెలికి తీసి హీరోగా మారారు.
విధినిర్వహణలో ఎన్ని ఆరోపణలు వచ్చినా, సవాళ్లు ఎదురైనా నవ్వుతూనే వాటిని ఎదుర్కొన్నారు. ఐదేళ్ల కాలానికి డిప్యుటేషన్ పై వచ్చిన లక్ష్మీనారాయణకు నిబంధనల మేరకు రెండుసార్లు ఏడాది చొప్పున సర్వీసు పొడిగించారు. ఈ నిబంధన ప్రకారం రెండుసార్లు మాత్రమే సర్వీసు పొడిగింపుకు అవకాశం వుంది. మరోసారి పొడిగించే వీలు లేనందున ప్రభుత్వం ఆదిశగా చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ప్రభుత్వం జేడీ బదిలీని ఆపలేకపోయింది. ఒక దశలో జేడీపై అక్రమసంబంధం ఆరోపణలు చేసినా తొణకకుండా తన బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆయన స్థానంలో చెన్నైకి చెందిన సీబీఐ అధికారి అరుణాచలం అదనపు జేడీగా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.