: రాన్ బాక్సీ మందులపై అపోలో నిషేధం
నకిలీ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్న రాన్ బాక్సీపై ఒకదాని తర్వాత ఒకటిగా దెబ్బపడుతోంది. నాణ్యతకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించిన కారణంగా అమెరికాలో రాన్ బాక్సీపై కేసు నమోదు అవడం, 2750 కోట్ల రూపాయలు చెల్లించడానికి కంపెనీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నకిలీ ఔషధాల బాగోతం బయటపడడంతో ఇప్పటికే ముంబైలోని జస్ లోక్ ఆస్పత్రి రాన్ బాక్సీ ఔషధాలపై నిషేధం విధించింది.
తాజాగా అపోలో హాస్పిటల్స్ కు చెందిన ఔషధ విక్రయ చైన్ అపోలో ఫార్మసీ కూడా రాన్ బాక్సీ మందులను తాత్కాలికంగా విక్రయించరాదని నిర్ణయం తీసుకుంది. అలాగే, రాన్ బాక్సీ నుంచి ఇక మందులను కొనుగోలు చేయరాదని నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయాన్ని మిగతా వాళ్లూ అనుసరిస్తే రాన్ బాక్సీపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. అదే సమయంలో ఔషధాల నాణ్యతలో జాగ్రత్తగా ఉండాలని మిగతా ఔషధ కంపెనీలకు హెచ్చరిక పంపినట్లూ ఉంటుంది. భారతీయ కంపెనీలలో అత్యధికం నకిలీ ఔషధాలను విక్రయిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.