: హఠయోగంతో మెమరీ పవర్ మెరుగు!
యోగాభ్యాసం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా కూడా మనకు ప్రశాంతత చేకూరుతుందని అందరూ అభిప్రాయపడుతుంటారు. అయితే హఠయోగం వల్ల మన మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. హఠయోగం వల్ల మనం నేర్చుకున్న అంశాలను మరిచిపోకుండా మన మెదడులో భద్రంగా ఉంచుకోవడం సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు.
ఈ పరిశోధనకు చెందిన శాస్త్రవేత్తలు కొందరు అభ్యర్ధులను ఎంపిక చేసుకుని వారికి ఏరోబిక్స్‌తోబాటు హఠయోగా శిక్షణను కూడా ఇచ్చారు. తర్వాత వీరిపై నిర్వహించిన పరీక్షల్లో హఠయోగ తాలూకు అద్భుతమైన ఫలితాలు స్పష్టమయ్యాయి. హఠయోగ సాధన చేయడం వల్ల అభ్యాసకుల్లో ఏకాగ్రత, అభ్యాస జిజ్ఞాస, తాను నేర్చుకున్న అంశాలను మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొనుట వంటివి సాధ్యమయ్యాయని ఈ అభ్యసనానికి నేతృత్వం వహించిన భారత సంతతికి చెందిన నేహాగోథే తెలిపారు. ఈ పరిశోధన వల్ల మన దేశంలో ఎంతో ప్రాచీన కాలానికి చెందిన యోగాభ్యాసానికి గల అపూర్వమైన శక్తిని గురించి ప్రపంచానికి మరోమారు ఋజువైందని పరిశోధకులు చెబుతున్నారు.