: పురాతన మానవుడికి కూడా క్యాన్సర్!
క్యాన్సర్ మహమ్మారి మధ్యయుగ కాలంలో దాపురించి ప్రాణాలు హరించి వేస్తోందని మనం అనుకుంటుంటా... అయితే ఈ మహమ్మారి ఇప్పటిది కాదు... మానవుడి పుట్టుక నుండే పుట్టింది. ఈ విషయం ఒక పురాతన మానవుడి ఎముకలోని కణితిని గమనించడంతో ఋజువయింది. క్రొయేషియాలోని క్రపీనా ప్రాంతంలో ఒక ఎముక లభించింది. ఈ ఎముక పురాతన మానవులు (నియాండెర్తల్) కు సంబంధించినది. అయితే ఈ ఎముకలో ఒక కణితిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ఎముక సుమారు 1.2 లక్షల ఏళ్ల క్రితంనాటి మనిషికి చెందినది. ఈ ఎముకలో ప్రస్తుతం తరచుగా కనిపిస్తున్న ఎముక క్యాన్సర్కు సంబంధించిన కణితి ఆనవాలును శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ కణితి నమూనా అసంపూర్ణంగా ఉండడం వల్ల సదరు క్యాన్సర్ మహమ్మారి ఆ మానవుడి ఆరోగ్యంపై అంతగా ప్రభావం చూపించి ఉండకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఇదంతా గమనిస్తే ప్రాచీన కాలంనాటి నుండే మనిషికి క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకి ఉండవచ్చు అనే విషయాన్ని మాత్రం సూచిస్తోంది.