: ఆ తివాచీ విలువ రూ. 202 కోట్లు...!
ఒక తివాచీ విలువ రూ.202 కోట్లు... అయితే ఇది అమ్మకపు విలువ కాదులెండి... వేలంలో సదరు తివాచీకి పలికిన ధర. ఒక తివాచీకి ఇంత ధర ఎందుకనుకుంటున్నారా...? ఎందుకంటే అది 17వ శతాబ్దానికి చెందినది కాబట్టి. అమెరికా సెనేటర్, పారిశ్రామిక వేత్త అయిన విలియం క్లార్క్‌కు ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశిష్ట కళాఖండాలను సేకరించే అలవాటు ఉండేది. దీంతో ఆయన 1925లో తాను చనిపోయే వరకూ పలు కళాఖండాలను సేకరించారు. వాటిలో 17వ శతాబ్దపు తొలి నాళ్లకు చెందిన పర్షియన్ తివాచీ కూడా ఉంది. వీటన్నింటినీ ఆయన 'కార్కోరన్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్'కు దానమిచ్చారు.
ఈ తివాచీ ఎనిమిది అడుగుల పొడవు, ఆరడుగుల వెడల్పు కలది. సఫావిద్ సామ్రాజ్యంలో అద్భుతమైన పనితీరుతో ఇది తయారయ్యింది. ఇలాంటి తివాచీతోబాటు ప్రాచీన కాలానికి చెందిన రగ్గులను, ఇంకా ఇతర తివాచీలను ప్రముఖ వేలం సంస్థ సోత్‌బే బుధవారం నాడు వేలం వేసింది. ఈ వేలంలో సదరు తివాచీ అంత ధర పలికింది. ఇంకా హైదరాబాద్‌కు చెందినదిగా భావిస్తున్న మొగల్ సిల్కు రగ్గు అనుకోని విధంగా రూ.3.6 కోట్ల ధర పలికింది.