: చిదంబరం, మోడీ మాటల యుద్ధం
తీవ్రవాద సమస్యను ఎదుర్కొనడానికి ప్రతిపాదించిన ఎన్సీటీసీపై కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, గుజరాత్ ముఖ్యమంత్రి మోడీల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ప్రతిపాదిత నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ బాగానే ఉన్నా, అది తమకు ఆమోద యోగ్యం కాదని మోడీ కరాఖండీగా చెప్పారు. కొత్త సంస్థను నెలకొల్పడం వ్యవస్థను అస్థిరపరుస్తుందని అన్నారు. జాతీయ భద్రత ముసుగులో రాజకీయ భద్రతకు ప్రయత్నిస్తున్నారంటూ, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలన్నీ అందుకేనంటూ విమర్శించారు .
దీనిపై చిదంబరం మోడీకి సూటిగా బదులిచ్చారు. తామేమీ కొత్త సంస్ధలు పెట్టడం లేదని, మల్టీ ఏజెన్సీ సెంటర్ పెట్టడాన్ని మోడీ ఇంతకు ముందు ప్రశంసించారనీ అన్నారు. ఎన్ఐఏ పెడితే అన్ని రాష్ట్రాలు తమకు కూడా ఎన్ఐఏ కావాలంటాయన్నారు. అయితే, ఇప్పటికీ కొందరు ముఖ్యమంత్రులు ఎన్సీటీసీ ని వ్యతిరేకించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. తాజా రూపంలోని ఎన్సీటీసీ ని అంగీకరించకపోతే దానికి దేశం యావత్తూ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చిదంబరం వ్యాఖ్యానించారు.