: ఇది ఓ కసాయి 'ప్రేమ'కథ!
ప్రేమించానన్నాడు.. తీయని ఊసులు చెప్పాడు... బాసలు చేసాడు.. తీరా పెళ్లి అనేసరికి మొహం చాటేసాడు. అంతేకాదు, తాను పెళ్లి చేసుకోవడానికి అడ్డు తగులుతుందని ఆమెను అంతంచేసేసాడా ప్రబుద్ధుడు. మహాబూబ్ నగర్ జిల్లా ఖిల్లా గణపురం షాపూర్ లో మల్లేష్ అనే కానిస్టేబుల్ నాంకీ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనుంచి పెళ్లి చేసుకోమని ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆమెను నెమ్మదిగా దూరం పెట్టాడు. ఈ దశలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కానిస్టేబుల్ మల్లేష్ సిద్దపడ్డాడు. ఆ విషయం తెలిసిన నాంకీ, మల్లేష్ ని నిలదీయడంతో 25 రోజుల క్రితం నాంకీని నల్లమల అడువుల్లోకి తీసుకెళ్లి హతమార్చి అక్కడే పూడ్చి పెట్టేశాడు.
ఒక్కసారిగా నాంకీ అదృశ్యం అవ్వడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో మల్లేష్ ను అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మృతదేహాన్ని తవ్వి తీయించారు. హత్య జరిగి చాలాకాలం కావడంతో కేవలం నాంకీ అస్థిపంజరం మాత్రమే మిగిలింది. దీంతో ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.