: రాత్రిళ్లు పనిచేస్తున్నారా... అయితే జాగ్రత్త!
మీరు రాత్రిపూట పనిచేసే ఉద్యోగం చేస్తున్నారా...? అయితే మీరు కాస్త మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వారికి షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో అది కూడా షిప్టుల్లో పనిచేసే ఉద్యోగుల్లో గ్లూకోజ్ నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని ఫలితంగా వారికి టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది.
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన క్రిష్టోఫర్ మోరిస్ మాట్లాడుతూ పగలు పనిచేసే వారికన్నా రాత్రి పూట పనిచేసే వారిలో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని తమ పరిశోధనలో స్పష్టమైందని అన్నారు. ఈ పరిశోధనలో తేలిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఒక్కరోజు రాత్రి షిప్టులో పనిచేసినందుకే వారిలో గ్లూకోజ్ నియంత్రణ వ్యవస్థ గణనీయంగా క్షీణించిందని, ఇన్సులిన్ స్థాయి పెరిగిందని ఆయన చెబుతున్నారు.