: మన ప్రాక్టీస్ పండింది!
భారత్ దుమ్మురేపింది.. కటువైన ప్రత్యర్థిని దంచికొట్టింది! ప్రాక్టీస్ మ్యాచే అయినా.. పట్టువదలకుండా పనిపూర్తిచేసింది. జూన్ 6న మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఆసీస్ తో జరిగిన వన్డే వామప్ పోరులో టీమిండియా 243 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. భారీ లక్ష్యఛేదనకు ఉపక్రమించిన కంగారూలను 65 పరుగులకే ఆలౌట్ చేసింది. కుర్ర స్పీడ్ స్టర్ ఉమేశ్ యాదవ్ (5/18) అద్భుత స్పెల్ తో విరుచుకుపడగా, ఇషాంత్ శర్మ (3/11) తనవంతు సహకారం అందించాడు. కార్డిఫ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్ ను దినేశ్ కార్తీక్ (146 నాటౌట్), కెప్టెన్ ధోనీ (91) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 211 పరుగులు జోడించడంతో టీమిండియా 300 మార్కు దాటింది. కాగా, ఈ విజయంతో భారత్ టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంది. టోర్నీ ఆరంభదినమైన జూన్ 6న భారత్.. పటిష్టమైన దక్షిణాఫ్రికాతో తలపడనుంది.