: కాశ్మీర్ లోయలో 'ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్' అరెస్ట్


ఆయన పేరు శివ్ కుమార్ శర్మ.. ముద్దుగా రాబిన్ హుడ్ అని పిలుస్తుంటారు! చేసే పని జమ్మూకాశ్మీర్ పోలీసు విభాగంలో సబ్ ఇన్ స్పెక్టర్ గిరీ! నిన్నటి వరకు ఈయన్ను టెర్రరిస్టుల పాలిట సింహస్వప్నంలా భావించారు. అందుకు బలమైన కారణమే ఉంది. ఇప్పటిదాకా శర్మగారు రమారమి 68 మంది తీవ్రవాదులను ఎన్ కౌంటర్లో తుదముట్టించాడు.. 'ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్' అనే బిరుదును స్వంతం చేసుకున్నాడు. సాహసోపేత సేవలకు గాను ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్ అవార్డునూ అందుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇంతటి నిబద్ధుడూ దారితప్పాడంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉగ్రవాదాన్ని రూపుమాపడమే లక్ష్యంగా కర్తవ్యం నిర్వర్తించిన ఈ ఎస్సై తానే ఓ తీవ్రవాద మూకను పెంచి పోషిస్తుండడం విస్తుగొలిపింది.

ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. కిస్త్వార్ జిల్లాలోని థాత్రి పోలీస్ స్టేషన్ పై గత నెలలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఆ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గుట్టురట్టయింది. ఎస్సై శర్మే తమకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చాడని వెల్లడించారు. దీంతో, ఈ టెర్రర్ ఇన్ స్పెక్టర్ ను అరెస్టు చేశారు. ఈ తీవ్రవాద మూక కాశ్మీర్ లోయలో కొన్ని రాజకీయ హత్యలకూ ప్రణాళికలు రచించిందని పోలీసు విచారణలో తేలింది.

  • Loading...

More Telugu News