: పేదల స్కూల్ కోసం సినీతారల ఫ్యాషన్ షో
ఉన్నతాశయం కోసం ఫ్యాషన్ షో నిర్వహించేందుకు ఫ్యాషన్ నెట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 7న సోమాజీ గూడ లోని 'ద పార్క్' హోటల్ లో నిర్వహించే ఈ షో లో సినీతారలు ర్యాంప్ వాక్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని, పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించనున్నారని నిర్వాహకులు తెలిపారు. బోరబండలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు కల్పిస్తూ ఈ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు ఫ్యాషన్ నెట్ సంస్థ నిర్వాహకుడు చైతన్య తెలిపారు.
పేద విద్యార్ధుల సహాయార్ధం ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని మాజీ మిస్ ఇండియా శిల్పారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రియ, ప్రియమణి, తాప్సీ, మంచు లక్ష్మీ, చార్మి, మధురిమ, జయప్రద, స్నేహా ఉల్లాల్, సందీప్, సామ్రాట్ చిన్నారులతో కలిసి వాక్ చేస్తారని తెలిపారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి పురంధేశ్వరి, మంత్రి డీకే అరుణ, కావూరి, కనుమూరి హాజరవుతారని తెలిపారు.