: ధోనీ.. శ్రీనివాసన్ రుణం తీర్చుకున్నాడా?


గతేడాది జనవరి వరకు విజయవంతమైన సారథిగా మన్ననలందుకున్న ధోనీకి ఆ తర్వాత కష్టకాలం ఎదురైంది. ఆ సమయంలో వరుసగా ఎనిమిది టెస్టుల్లో ఓటమి చవిచూడడంతో ఈ జార్ఖండ్ డైనమైట్ కెప్టెన్సీపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సిరీస్ ఓటములు, స్వదేశంలోనూ టెస్టు పరాజయాలు టీమిండియాను ఐసీసీ ర్యాకింగుల్లో కిందకు దింపాయి. దీంతో, ధోనీ ప్రాభవం గతించిందని, అతను తప్పుకోవడమే మేలని క్రికెట్ పండితులు తమ దాడుల్లో పదును పెంచారు.

వీటికితోడు, 2012 ఆరంభంలో జరిగిన బీసీసీఐ సమావేశంలో ధోనీని తప్పించాల్సిందే అని సెలెక్టర్లు పట్టుబట్టారు. ఓటింగ్ లో సైతం 3-2తో ధోనీకి వ్యతిరేకంగా సెలెక్టర్లు తమ అభిప్రాయాన్ని నివేదించినా.. అప్పుడు బీసీసీఐ చీఫ్ గా ఉన్న ఎన్. శ్రీనివాసన్ తన విశేష అధికారాన్ని వినియోగించారు. వీటో పవర్ తో ఆ తీర్మానాన్ని రద్దు చేశారు. తద్వారా, కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం నుంచి ధోనీని కాపాడారు. ఎందుకంటే, శ్రీనివాసన్ స్వంత ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ ధోనీయే. అంతేగాదు, సూపర్ కింగ్స్ మాతృసంస్థ ఇండియా సిమెంట్స్ లో ధోనీ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ ఇండియా సిమెంట్స్ సంస్థకు శ్రీనివాసనే యజమాని. ఇప్పుడీయన తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టు కావడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో, ఫిక్సింగ్ వ్యవహారమై ఏ ప్రశ్న అడిగినా, ధోనీ నుంచి మౌనమే సమాధానమై భాషిస్తోంది. సూపర్ కింగ్స్ యాజమాన్యంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దృష్ట్యా టీమిండియా సారథి తాజా వ్యవహారశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో గురునాథ్ పాత్రపై తనకు తెలిసిన విషయాలు వెల్లడించకుండా ధోనీ ఉద్ధేశపూర్వకంగానే పెదవి విప్పడంలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. శ్రీనివాసన్ సంస్థలతో ఆర్ధిక లావాదేవీలే ధోనీని కట్టిపడేస్తున్నాయని, ఒకనాడు తనను ఉద్వాసన గండం నుంచి గట్టెక్కించిన శ్రీనివాసన్ కు ఈ రూపేణా రుణం చెల్లించుకున్నాడని క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News