: అతిగా సీటీ స్కాన్లు తీయించుకుంటున్నారా... కాస్త ఆలోచించండి!
చిన్నతనంలోనే సీటీ స్కాన్లను చేయించుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదమున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. వివిధ రకాల ఆరోగ్యపరమైన సమస్యలను గుర్తించేందుకు కంప్యూటరైజ్డ్ టొమోగ్రఫీ (సిటి) స్కాన్లను తీయించుకుంటారు. అయితే ఇలాంటి స్కాన్లను అతిగా చేయించుకుంటే మాత్రం క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఇన్ ఫ్రాన్స్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంపై సంయుక్తంగా అధ్యయనం చేశారు. ఆష్ట్రేలియాలో సుమారు 11 మిలియన్ల మంది యువతను ఈ సందర్భంగా అధ్యయనం చేశారు. వీరిలో 6,80,000 మంది 1985-2005 మధ్యకాలంలో సీటీ స్కాన్లను చేయించుకున్నవారే. వీరిలో 20 ఏళ్లలోపు వయసున్నప్పుడు సీటీ స్కాన్‌లను చేయించుకున్న ప్రతి 1400 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చినట్టు ఈ అధ్యయనంలో తేలింది.