: మోసపోయింది చాలు, గోస పడింది చాలు: కేసీఆర్
నిజాం కళాశాల మైదానంలో టీఆర్ఎస్ బహిరంగ సభలో కేకే, మందా, వివేక్ లు టీడీపీ నుంచి రాజీనామా చేసిన మర్రి జనార్ధన్ రెడ్డి, పి చంద్రశేఖర్, జేఏసీ నేత నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ తన ప్రాణం, ప్రయాణం తెలంగాణ సాధనే అని, కాంగ్రెస్ లో తాను ఫెయిలయ్యానని అందుకే టీఆర్ఎస్ లో చేరానని తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యమం తరపున తాను పోడియంలోకి వెళితే అప్పుడు తనతో పాటు కేకే, వివేక్, మందాలు మాతో కలిసి సోనియా సమక్షంలో పోరాడారని అన్నారు. ఆజాద్ రోజుకోమాట చెబుతున్నారని, మెయిలీ పూటకో మాట చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై ఇచ్చిన మాట మరిచారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ లో చేరిన ఎంపీలు బేరసారాలు ఎక్కడ ఆడారో చెప్పాలని డిమాండ్ చేసారు. వీరి మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని తెలిపారు.
ఒక పత్రిక తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని, మా ఓపికకు కూడా హద్దుంటుందని హెచ్చరించారు. టీడీపీ, వైఎస్సార్ సీపీలు అధికారంలోకి వస్తే ఒక్కడైనా తెలంగాణ ముఖ్యమంత్రి వస్తాడా? అని ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు దండిగా ఉన్నాయని తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జూన్ 14 న అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు.
బయ్యారంలో 30 వేల ఉద్యోగాలు వస్తాయని పోరాడుతున్నామన్నారు. కోటి ఎకరాలకు కృష్ణా గోదారి నీళ్లిస్తామని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూం ఫ్లాట్ నిర్మిస్తామని తెలిపారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయిస్తామని తెలిపారు. అనంతరం ఉర్దూలో మాట్లాడుతూ ముస్లింలను ఆకట్టుకున్నారు.