: 'వల'సలకు వేళాయెరా
తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న రెండు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ ఒక్కరోజు తేడాలో హైదరాబాద్ లోనే బహిరంగ సభలను నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రెండు సభలకు నిజాం కళాశాలే వేదిక కానుంది. చిత్రమేమిటంటే, ఈ సభల ద్వారా ఈ రెండు పార్టీలలోకి ప్రముఖ నేతలు వచ్చి చేరుతుండడం!
ఈ రోజు జరగనున్న బహిరంగ సభను టీఆర్ఎస్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేశవరావు, ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ తో పాటు వినోద్, టీడీపీ నేత మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తెలంగాణ కోసమే అని పైకి ప్రకటించినప్పటికీ ప్రధానంగా దీనిని వలసల కోసమే నిర్వహిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్, ఇతర పార్టీలకు తమ సత్తా ఏమిటో చూపించాలని కేసీఆర్ వ్యూహం.
మరోవైపు బీజేపీ కూడా రేపు నిజాం కళాశాలలో సభ నిర్వహిస్తోంది. దీనికి బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు రానున్నారు. మాజీ మంత్రి, టీడీపీలో ముఖ్య నేతగా పేరొంది, తర్వాతి కాలంలో తెలంగాణ కోసం ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కొంత కాలం పాటు స్వతంత్రంగా ఉద్యమించిన నాగం జనార్దన్ రెడ్డి ఈ సభలోనే కాషాయ దండులోకి చేరుతున్నారు. తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరికొందరు నేతలు కూడా బీజేపీలోకి వచ్చి చేరుతున్నారని పార్టీ నేతలు ప్రకటించారు.