: వేల సంవత్సరాలైనా రక్తం ప్రవహిస్తోంది!
ఆ ఏనుగు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు గడచిపోయాయి... అయినా దాని శరీరంలో ఇంకా వెచ్చని రక్తం ప్రవహిస్తోంది...! ఇలాంటి ఒక అద్భుతాన్ని ఆర్కిటిక్ మహాసముద్రంలోని ఒక ద్వీపంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆర్కిటిక్ సముద్ర ప్రాంతం అత్యంత శీతల ఉష్ణోగ్రతలతో కూడివుంటుంది. అయితే ఇలాంటి ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని ఆ ఏనుగు కళేబరంలో రక్తం ఇంకా ప్రవహిస్తుండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు 10 నుండి 15 వేల ఏళ్ల క్రితం చనిపోయి, మంచులో కూరుకుపోయిన వూలీ మ్యామత్ ఏనుగు శరారాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు దాన్ని బయటికి తీసే క్రమంలో గునపంతో పొడవడంతో దాని శరీరం నుండి రక్తం చిమ్మింది. ఈ విషయం గురించి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మ్యామత్ మ్యూజియం ఛైర్మన్ సెమీయాన్ గ్రిగోరీవ్ మాట్లాడుతూ, ఈ మ్యామత్ నుండి బయటికి వచ్చిన రక్తం చాలా చిక్కగా ఉందని, ఏనుగు కడుపు దిగువ భాగంలోని ఖాళీ రంధ్రాల్లో గునపంతో పొడిచినపుడు రక్తం ఎగజిమ్ముకుంటూ వచ్చిందని అన్నారు.
అయితే, ఈ మంచు తవ్వకాల సమయంలో వాతావరణంలో 7 నుండి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడం ఆసక్తిని కలిగించే విషయమని ఆయన అన్నారు. మ్యామత్‌ల రక్తంలో అతి శీతల పరిస్థితులను తట్టుకుని గడ్డకట్టకుండా ఉండే గుణాలు ఉండి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రక్తం వేలాది సంవత్సరాలుగా ద్రవ కణజాలం పాడవకుండా ఎలా ఉండగలదో తెలుసుకునేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లోని కీటకాలు, చేపలు, ఉభయచరాలు అతి శీతల పరిస్థితుల్లో కూడా రక్తం గడ్డకట్టకుండా ఉండేలా రసాయనాలు, ప్రోటీన్లను తమ శరీరంలో సృష్టించుకుంటాయి.
ఇలాంటి ఆడ మ్యామత్ ఏనుగు కళేబరాన్ని ల్యాఖోవ్‌స్కీ ద్వీపంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని శరీర పైభాగం, తల, వెనుక ఎడమకాలు కండరం మాత్రమే క్షీణించి ఉన్నట్టు వారు తెలిపారు. దాని కండర కణజాల పోచలు సహజమైన ఎరుపురంగులోనే తాజాగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు వివరించారు. శరీరం దిగువభాగంలో స్వచ్ఛమైన మంచు కప్పబడి ఉండడం దీనికి కారణమై ఉండొచ్చని వారు అంచనా వేశారు. అంతేకాదు... ఈ ఏనుగు తాజా రక్తాన్ని సేకరించి శాస్త్రవేత్తలు భద్రపరిచారు. దీని రక్తం ఎన్‌ఈఎఫ్‌యూ, సూవోమ్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన 'మ్యామత్ రీబర్త్' ప్రాజెక్టుకు ఎంతగానో ఉపకరించే అవకాశముందని వారు భావిస్తున్నారు.