: పెరుగుతో మానసికారోగ్యం మెరుగు
రోజూ మన ఆహారంలో కొంత మొత్తంలో పెరుగు తీసుకుంటే మంచిదని ఇప్పటికే వైద్యులు చెబుతున్నారు. అయితే పెరుగు తీసుకోవడం వల్ల అందులోని ప్రొ బయోటిక్స్ మన మానసిక ఆరోగ్యంపై మరింత ప్రభావాన్ని చూపుతాయని ఒక తాజా అధ్యయనం చెబుతోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లు సంయుక్తంగా నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ అధ్యయనంలో మనం తినే ఆహారంలో ఉండే పదార్ధాల వల్ల మన మెదడుకు ఎలాంటి సంకేతాలు అందుతాయి? అనే అంశాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా 18 నుండి 53 ఏళ్ల వయసున్న మహిళలను మూడు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి రోజూ రెండు పూటలా పెరుగుని ఆహారంగా ఇచ్చారు. మరో గ్రూపు వారికి కేవలం పాల ఉత్పత్తులనే అందించారు. మూడో గ్రూపు వారికి అన్నంతోబాటు ఇతర పదార్ధాలను కూడా ఆహారంగా ఇచ్చారు. ఒక నెల తర్వాత వారి భావోద్వేగాలను పరిశీలిస్తే రోజూ ఆహారంలో పెరుగు తీసుకున్న వారు తమ భావోద్వేగాలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకున్నట్టు తేలింది. మిగిలిన రెండు బృందాల్లోని మహిళల భావోద్వేగాల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. దీంతో ఆహారంలో క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల అది మన మెదడుపై ప్రభావం చూపించి మానసికంగా మన భావోద్వేగాలను అదుపులో ఉంచడమే కాకుండా మన శారీరక ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.