: వేలంలో పాల్గొనని టెలికాం కంపెనీలు సేవలు నిలిపేయాలి: సుప్రీంకోర్టు


2జీ స్పెక్ట్రమ్ వేలం పాటలో పాల్గొనని టెలికాం కంపెనీల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. లైసెన్సులు రద్దయ్యి వేలంపాటలో పాల్గొనని టెలికాం కంపెనీలు సేవలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు లైసెన్సులు రద్దు చేసిన తర్వాత కూడా సేవలను కొనసాగిస్తున్న కంపెనీలు వేలంలో నిర్ణయించిన కనీస ధరను చెల్లించాలని ఆదేశించింది. లైసెన్సుల రద్దు కారణంగా మిగిలిపోయిన స్పెక్ట్రమ్ ను కచ్ఛితంగా వేలం వేయాలని పేర్కొంది. అయితే, తమ లైసెన్సు రద్దు ఆదేశాలు 900 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉన్న కంపెనీలకు వర్తించదని స్పష్టం చేసింది.

2జీ స్కాముపై విచారించిన సుప్రీంకోర్టు పలు కంపెనీల లైసెన్సులను లోగడ రద్దు చేసిన సంగతి తెలిసిందే. స్పెక్ట్రమ్ కేటాయింపులలో అవకతవకలను తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. స్పెక్ట్రమ్ ను తక్కువ ధరలకు కేటాయించడం వల్ల 1.75 లక్షల కోట్ల రూపాయల వరకూ ఖజానాకు నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. దీంతో ఆ కేటాయింపులను రద్దుచేస్తూ నూతన ధరల ఆధారంగా స్పెక్ట్రమ్ ను వేలం వేయాలని కోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాల కారణంగా గత నవంబర్లో కేంద్ర ప్రభుత్వం స్పెక్ట్రమ్ వేలం వేసింది. కానీ, భారీ ధరలకు జడిసి కంపెనీలు దూరంగా ఉండిపోయాయి. కనీసం లైనెన్సులు కోల్పోయిన కంపెనీలు కూడా పెద్దగా ముందుకు రాలేదు. యూనినార్, సిస్టెమా, శ్యామ్ టెలీ తదితర కంపెనీలు వేలంలో పాల్గొనలేదు. ఇప్పుడు ఈ కంపెనీలకు సుప్రీం ఆదేశాలు మింగుడుపడనివే!

  • Loading...

More Telugu News