: కొత్త కారు 'జుగాడ్‌' అధిక వేగం, ఖర్చు తక్కువ!


ఈ కొత్త రకం కారు పేరు జుగాడ్‌. ఏ కంపెనీది అని అడుగుతున్నారా... ఇది పెద్ద పేరున్న బ్రాండెడ్‌ కంపెనీది మాత్రం కాదులెండి. అయితేనేం... ఈ జుగాడ్‌ ఎంచక్కా ఒక లీటరు పెట్రోలు పోస్తే ఇట్టే 300 కిలోమీటర్లు దూరం రయ్యిన దూసుకెళ్లిపోతుంది. దీన్ని తయారు చేయడానికి ఖర్చు కూడా తక్కువే. బరువు కూడా తక్కువే అంటున్నారు దీన్ని రూపొందించిన కుర్ర శాస్త్రవేత్తలు.

ముంబైకు చెందిన సోమయ్య కళాశాల విద్యార్ధులు 'జుగాడ్‌ ఆవిష్కరణ' అనే పుస్తకం నుండి స్ఫూర్తి పొందారు. ఈ స్ఫూర్తితో వీరు ఒక కొత్తరకం కారును తయారు చేసి దానికి జుగాడ్‌ అనే పేరు పెట్టారు. ఇందుకోసం వారు పెద్ద పెద్ద విలువైన వస్తువులను కొనుగోలు చేయలేదు. అక్కడక్కడా కారుకు సంబంధించిన విడిభాగాలను, అలాగే పనికిరాని ఫైబర్‌, గాజు వస్తువులను సేకరించారు. ఇక ఇంజన్‌గా లాన్‌లో గడ్డిని కత్తిరించే వాహనానికి చెందిన ఇంజన్‌ను తీసుకున్నారు. ఇలా సేకరించిన వస్తువులతో రోజుకు 9 గంటల పాటు శ్రమించి ఈ కొత్త కారును తయారు చేశారు. ఇందుకోసం పాపం వాళ్లు కొన్ని సార్లు కాలేజీకి కూడా డుమ్మా కొట్టారట.

ఈ ఫైబర్‌ గ్లాసుతో తయారు చేసిన కారుకు ముందు రెండు చక్రాలుంటే వెనుక ఒకటే చక్రం ఉంటుంది. బరువు 60 కిలోలు మాత్రమే. అయితేనేం లీటరు పెట్రోలు పోస్తే 300 కిలోమీటర్ల దూరం దూసుకెళుతుంది. ఇప్పుడు పెరుగుతున్న పెట్రోలు ధరల్లో ఇలాంటి కారుంటే అందరికీ మంచిదేకదా...! ఈ కారు తయారీకి వారికి రూ.4 లక్షలు ఖర్చయిందట. తాము రూపొందించిన ఈ కొత్త కారును జూలై నెలలో మలేషియాలో జరగనున్న 'షెల్‌ ఎకో మారథాన్‌'లో ప్రదర్శించనున్నట్టు ఈ యువ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News