: విశాఖ ఎంపీ సీటుపై ముదురుతున్న వివాదం
నరసారావు పేట స్థానాన్ని తాము కోరినట్టు సుబ్బిరామిరెడ్డి చెప్పడాన్ని ఖండిస్తున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. తాము అధిష్ఠానం చెప్పినట్టే నడుచుకుంటున్నామని స్పష్టం చేసారు. విశాఖ సీటు పురంధేశ్వరికి ఇవ్వద్దని సుబ్బిరామి రెడ్డి 2009లోనే అధిష్ఠానానికి లేఖ రాసారని తెలిపారు. గత కొన్ని రోజులుగా సుబ్బిరామిరెడ్డి, పురంధేశ్వరికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
విశాఖ ఎంపీ స్థానం కోసం ఇద్దరూ తీవ్రంగా పోట్లాడుకుంటున్నారు. మీడియా సాక్షిగా పలు మార్లు విమర్శలు కురిపించుకున్నారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. పురంధేశ్వరి విశాఖకు చేసిందేమీ లేదని గతంలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ బహిరంగంగానే విమర్శలకు దిగారు. అనవసర విమర్శలు చేస్తే విశాఖకు ఎవరు ఏం చేసారో ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంపీగా ఉంటూ స్థానికంగా నివాసం లేని ఎంపీ స్థానికులకు ఏం చేస్తుందని నిష్ఠూరమాడారు. విశాఖ సమస్యలేంటో ఆమెకు తెలీదని, కేవలం ఎన్టీఆర్ కుమార్తెగానే ఆమె గెలిచారన్న విషయాన్ని గుర్తించాలని కూడా విమర్శించారు. తాజా వ్యాఖ్యలతో పురంధేశ్వరి, సుబ్బిరామిరెడ్డిల మధ్య వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది.