: చాముండి కేరెక్టర్ మంచిది కాదు: ఏసీఏ కార్యదర్శి ఆరోపణలు


ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో (ఏసీఏ) జరిగిన నిధుల దుర్వినియోగం, అక్రమాలపై అవినీతి వ్యతిరేక శాఖ విచారణకు ర్రాష్ట్ర హైకోర్టు తాజాగా అనుమతించడంతో నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏసీఏ మాజీ అధ్యక్షుడు, మాజీ కార్యదర్శి అయిన చాముండేశ్వరీ నాథ్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

క్రీడాకారిణులను ముస్తాబు చేసి 
చాముండేశ్వరీ నాథ్... సచిన్ వద్దకు పంపించారని వెల్లడించారు. ఈ విషయంలో జాగ్రత్తగా వుండాలని తాను సచిన్ కు  అప్పట్లో సూచించానని గంగరాజు తెలిపారు. అయితే సచిన్ వ్యక్తిత్వంపై తనకు అనుమానం లేదని, ఆయనంటే గౌరవం వుందని చెప్పారు. కాకపోతే చాముండేశ్వరీ నాథ్ కేరక్టర్ మంచిది కాదన్నారు.

అలాగే, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ (వాన్ పిక్ కేసులో నిందితుడిగా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్లో వున్నారు) తో కలిసి అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చాముండేశ్వరీ నాథ్ ప్రభావితం చేసాడని ఆరోపించారు.  ఏసీఏలో కొనసాగేందుకు  వైఎస్ తో ఒత్తిడి తీసుకు వచ్చాడని వెల్లడించారు. ఏసీఏలో ఇక ముందూ కొనసాగుతానని గంగరాజు ప్రకటించారు. తాను ఎటువంటి అక్రమాలకూ పాల్పడలేదని చెప్పారు.

ఏసీఏ అభివృద్ధికి తోడ్పడతాడని చాముండేశ్వరీ నాథ్ ను తీసుకు వచ్చానని వివరించారు. అయితే ఆయన సంగతి తెలిసిన తర్వాత విభేదించానని వివరణ ఇచ్చారు. వాస్తవానికి గతంలోనూ చాముండేశ్వరీ నాథ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు గంగరాజు వాటిని బలపరిచేలా మాట్లాడడం గమనార్హం. విశాఖపట్నం, కడప స్టేడియాల నిర్మాణం, పలు ఇతర కార్యక్రమాల విషయంలో నిధుల అక్రమాలు జరిగాయంటూ వాటిపై విచారణ జరపాలని  ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ నేతలు 2011లో  కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఏసీబీ విచారణకు అనుమతించింది.

దీనిపై 
ఏసీఏ హై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. తాజాగా దాన్ని ఎత్తివేసి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ విచారణ ప్రారంభించింది. దీనిపై ఏసీఏ మీడియా వ్యవహారాల ప్రతినిధి మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయితేనే విచారణ చేయమని కోర్టు చెప్పిందని తెలిపారు.  ఏసీఏకు ప్రభుత్వనిధులు రావని చెప్పారు. అలాగే విచారణ చేయమని చెప్పింది కానీ, ఎవరినీ అరెస్ట్ చేయమని చెప్పలేదని అన్నారు. అవినీతి ఆరోపణలను మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం. మొత్తం మీద మరోసారి  ఏసీఏలో ఆధిపత్య పోరుకు తెర లేచిందని అంటున్నారు. ఈ విచారణ ఎటు దారితీస్తుందో చూడాల్సి వుంది!

  • Loading...

More Telugu News