: చైనాలో కూడా ఇలా చేస్తారా?!
అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనాలో కూడా మనదేశంలో లాగానే అప్పుడే పుట్టిన శిశువును మాయ కూడా తీయకముందే మురికి గొట్టంలోకి తోసేశారు. అయితే, బిడ్డ ఏడుపు విన్న వైద్యులు ఆ బిడ్డను రక్షించారు. చైనాలోని జెరియాంగ్ రాష్ట్రంలో జిన్హువాలోని ఒక అపార్టుమెంట్ నాలుగో అంతస్తునుండి శనివారం నాడు ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించిందట. దీంతో అగ్నిమాపక సిబ్బంది వారు అక్కడికి వెళ్లి గమనిస్తే మరుగుదొడ్డికి అనుసంధానంగా ఉన్న మురుగునీటి గొట్టం నుండి బిడ్డ ఏడుపు వినిపిస్తున్నట్టుగా గమనించారు. దీంతో వారు పదిసెంటీమీటర్ల వ్యాసం ఉన్న ఆ మురుగునీటి గొట్టాన్ని చక్కగా కత్తిరించారు.
వారు కత్తిరించిన గొట్టంలోనే పసిబిడ్డ ఉన్న సంగతి గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ పైపును వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లారు. అక్కడ అందరూ కలిసి గంటపాటు శ్రమించి ఆ పసిబిడ్డను బయటికి తీశారు. 2.3 కేజీల బరువున్న మగబిడ్డ సుమారు రెండు గంటల సమయం ఆ గొట్టంలోనే నరక యాతన అనుభవించింది. బయటికి వచ్చిన బిడ్డకు మాయ కూడా అలాగే ఉంది, అంతసేపు గొట్టంలో ఉండడం వల్ల హృదయస్పందన కూడా తక్కువగా ఉండడంతో ఆ బిడ్డను ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఈ బిడ్డను ఎవరైనా చంపేందుకు ప్రయత్నించారా, లేదా వివాహం కాకుండానే గర్భం ధరించిన వారు బిడ్డను వదిలించుకునేందుకు ఇలా చేశారా అనే దిశగా పోలీసులు పరిశోధిస్తున్నారు. అయినా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో సగర్వంగా నిలిచే చైనాలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయా...? లేక చైనాలో ఏకసంతాన విధానం కారణంగా తల్లిదండ్రులకు ఒక సంతానానికి మించిన సంతానం ఉంటే వారు ప్రభుత్వానికి భారీ జరిమానా విధించాల్సి ఉంటుంది. ఈ విధానం కారణమై ఉంటుందా...?