: సెమీ కండక్టర్‌లా పనిచేసే సిమెంట్!
సిమెంట్ మామూలుగా అయితే నిర్మాణాలకు ఉపయోగపడుతుంది. అయితే ఈ కొత్తరకం సిమెంట్ సెమికండక్టర్‌లాగా పనిచేస్తుందట. అమెరికా, జపాన్, ఫిన్‌ల్యాండ్, జర్మనీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త రకం సిమెంటుకు సంబంధించిన సరికొత్త సూత్రాన్ని ఆవిష్కరించారు. ద్రవరూప లోహంగా మారే ఈ కొత్త రకం సిమెంట్‌తో ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువుల్లో వాడే పలుచటి ఫిల్ములు రక్షణాత్మక పూతలు, కంప్యూటర్ చిప్‌ల తయారీకి ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సంప్రదాయ లోహంతో పోలిస్తే ఇది తక్కువగా తుప్పుపట్టే గుణాన్ని కలిగి ఉంటుంది. లోహపు గాజు పదార్ధం తయారీకి ఇదో కొత్త లోహమని, అయస్కాంత క్షేత్రాల్లో ఇది తక్కువ శక్తిని నష్టపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో లోహాలు మాత్రమే గాజు రూపంలోకి మారగలిగాయి. అయితే ఇప్పుడు లోహరూపంలోకి మారే ఈ సిమెంటు కూడా గాజు రూపంలోకి మారగలుగుతుంది. అంతేకాదు ఇది మామూలు గాజుకన్నా తక్కువ పెళుసుదనాన్ని కలిగి ఉంటుంది. తాజాగా ఎలక్ట్రాన్ ట్రాపింగ్ అనే విధానం ద్వారా ఈ కొత్తరకం సిమెంటును కూడా ఈ రూపంలోకి మార్చగలిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలను చేయడం ద్వారా విద్యుత్ వాహకంగానీ, మరి ఏ ఇతర పదార్ధాలను గానీ సెమీ కండక్టర్లుగా మార్చే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న క్రిన్ బెన్‌మోర్ మాట్లాడుతూ ఎల్‌సీడీల్లో వాడే పలుచటి ఫిల్మ్ రెసిస్టర్లను దీనితో తయారు చేయవచ్చని, ఇంకా ఈ పదార్ధంతో అనేక ప్రయోజనాలున్నాయని అంటున్నారు.