: ఆలూతో ఆరోగ్యంగా ఉందాం!
మనం ఆహారంలో తీసుకునే ఆలూ మంచి పోషకవిలువలు కలిగిన ఆహారమేనని తాజా అధ్యయనం చెబుతోంది. ఆలుగడ్డలో మంచి పోషకవిలువలు ఉన్నాయని, ఇతర పచ్చి కూరగాయలకన్నా ఇవి మంచి ఆహారమేనని పరిశోధకులు చెబుతున్నారు. వీటిద్వారా మన శరీరానికి కావలసిన పోటాషియం పుష్కలంగా లభిస్తుందట. మన శరీరానికి సరయిన పొటాషియం అందించాలంటే ముఖ్యంగా మన ఆహారంలో ఆలూని చేర్చుకోవాలి, ఆ తర్వాత బీన్స్ చేర్చుకుంటే సరి.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఆడమ్ డ్రూన్‌స్కి కూరగాయలకు సంబంధించి అందుబాటులో ఉండడంతోబాటు అధిక పోషక విలువలను అందించే ఆహారానికి సంబంధించి ఒక పట్టికను రూపొందించారు. ఇందులో ఎక్కువ ధర కలిగినప్పటికీ అధిక పోషక విలువలను అందించే ఆహారం జాబితాలో డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ ఉన్నాయి. అలాగే ధర అందుబాటులో ఉండడంతోబాటు అధిక పోషక విలువలను అందించే ఆహారం జాబితాలో మొదట ఆలూ తర్వాత స్థానంలో బీన్స్ ఉన్నాయట. అందరికీ అందుబాటు ధరలో లభించే ఆలూలో అధిక పోషకాలతోబాటు పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఇంకా మెగ్నీషియం కూడా ఉన్నాయట. కాబట్టి ఆహారంలో ఆలూని చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు పరిశోధకులు. ఆలూ అటు అందుబాటు ధరలోనూ లభిస్తుంది... ఇటు ఆరోగ్యాన్ని ఇస్తుంది!