: మొక్కనుండి గుడ్డు...!
మనం తినే గుడ్డు ఎక్కడి నుండి వస్తుంది? కోడి నుండి వస్తుంది. అయితే అదే గుడ్డు మొక్కల నుండి వస్తే...?! అప్పుడు పూర్తి శాకాహారులకు ఆనందమేకదా! ఈ విషయంపై పరిశోధించిన శాస్త్రవేత్తలు పూర్తిగా నూటికి నూరుపాళ్ళు మొక్కల నుండి గుడ్డును తయారు చేసే ప్రయత్నం చేశారు. కాలిఫోర్నియాలోని అమెరికాకు చెందిన ఒక సంస్థ ఈ శాకాహార గుడ్డును తయారు చేసే ప్రయత్నాలు చేస్తోంది. కోడిగుడ్డులో ఉండే సుగుణాలన్నీ కూడా ఈ శాకాహార గుడ్డులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.
కోడిగుడ్డుకు ప్రత్యామ్నాయంగా తయారు చేస్తోన్న ఈ మొక్కలకు సంబంధించిన గుడ్డులో కోడిగుడ్డులో ఉండే మాంసకృత్తులు కూడా తగుమాత్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆసియాలో లభించే ఒక మొక్క నుండి తీసే పదార్ధానికి ముందుగా ద్రవరూపంలో ఉండి, వేడి తగలగానే వెంటనే గట్టిపడే తత్వం ఉందనే విషయాన్ని గమనించామని, దీన్ని ఉపయోగించి గుడ్డును తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, తాము తయారు చేసే గుడ్డుతో మామూలు కోడిగుడ్డుతో చేసుకునే పొడికూర తరహాలో కూడా చేసుకునే విధంగా వీలుండేలా అవసరమైన ప్రయోగాలు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి చెబుతున్నారు. ఈ గుడ్డు త్వరలో మార్కెట్లోకి వస్తే... అప్పుడు శాకాహారులకు ఆనందమే!