: మూల్యం చెల్లించుకున్న మహేంద్ర కర్మ
చత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల చేతిలో హతమైన మహేంద్ర కర్మ ప్రముఖ గిరిజన నేత. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా, అజిత్ జోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్ గఢ్ లో తీవ్ర స్థాయిలో సాగుతున్న మావోయిస్టుల అరాచకాలకు సల్వాజుడుం పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేసిన సాహస నేత. గిరిజనులపై మావోయిస్టుల ఆధిపత్యం నచ్చక 2005లో సల్వాజుడుం ఏర్పాటు చేశారు. స్థానిక గిరిజనులను పత్ర్యేక పోలీసు అధికారులుగా నియమించుకుని మావోయిస్టులపై పోరాటం సాగించారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వారికి శిక్షణ, ఆయుధాలు, నిధులు అందించి తన వంతు సాయం చేసింది. అయితే, ఎస్పీవోలు మావోయిస్టులపై దాడులతోపాటు గిరిజనులపై అరాచకాలకు తెగబడ్డారు.
దీంతో మావోయిస్టులను అణచివేయాలన్న మహేంద్ర కర్మ లక్ష్యం తర్వాత గాడి తప్పింది. మావోయిస్టుల ఎదురుదాడిలో సల్వాజుడుంలోని వేలాది మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది మావోయిస్టులూ మరణించారు. చివరికి మహేంద్ర కర్మ కూడా విషయాన్ని గ్రహించి సల్వాజుడుంను రద్ధు చేయాలనే నిర్ణయానికొచ్చారు. మరోవైపు మావోయిస్టులపై పోరాడడానికి ప్రజలకే ఆయుధాలను ఇచ్చి పంపుతారా? అంటూ సుప్రీంకోర్టు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంపై మండిపడింది. 2011లో సల్వాజుడుంను రద్ధు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే గిరిజనుల సహకారంతో బలంగా వేళ్లూనికొని ఉన్న తమను దెబ్బతీసిన మహేంద్రకర్మను హతం చేయాలని మావోయిస్టులు ఆనాడే నిర్ణయించుకున్నారు. 2012లో దంతెవాడలో మందుపాతర పేల్చారు. ఈ దాడిలో మహేంద్ర కర్మ కారు డ్రైవర్, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మహేంద్ర కర్మ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. కానీ, నిన్న మాత్రం మావోయిస్టుల దాడికి బలైపోయారు. అయినా, సల్వాజుడుం వ్యవస్థాపకుడిగా, మావోయిస్టులపై పోరు సాగించిన నేతగా మహేంద్రకర్మ చరిత్రలో నిలిచిపోతారు.