: కేసీఆర్.. నీ నక్కజిత్తులు మా వద్ద కుదరవ్: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నక్కజిత్తులు వీడాలని, లేకుంటే కుక్క కాటుకు చెప్పుదెబ్బ కొడతామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో రేవంత్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణపై కాంగ్రెస్ ను నిలదీయకుండా, టీడీపీపై దాడి చేయడం తగదని స్పష్టం చేశారు. శిక్షణ శిబిరాల పేరిట విద్యార్థులకు, సమాజానికి నీచమైన భాషను బోధిస్తున్నావా? అంటూ రేవంత్ మండిపడ్డారు.
ఆయన 'బుడ్డిపేట' బుల్డోజర్ అయినా తమకు అభ్యంతరం లేదని, ఫార్మ్ హౌస్ కు పరిమితమైనా తమకు అభ్యంతరం లేదని కేసీఆర్ పై వ్యంగ్యోక్తులు విసిరారు. వంద ఎమ్మెల్యే సీట్లు, 16 ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణ తీసుకువస్తానని అందర్నీ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వంద సీట్లు వస్తే సోనియాకు తాకట్టు పెట్టేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి మంది విద్యార్థులను బొంద పెడితే, ఆ పునాదులపై కేసీఆర్ వంద సీట్లు గెలవాలని ఆశిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు వలసలు ఆరంభమయ్యాయో తెలుసుకోవాలని కేసీఆర్ కు హితవు పలికారు.