: 'మెంటల్' హీరోయిన్ కు సల్మాన్ మద్దతు
ఓ టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రస్తుతం పరారీలో ఉన్న సనా ఖాన్ పై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సానుభూతి కురిపిస్తున్నాడు. ఆమె అమాయకురాలంటూ తన హీరోయిన్ కు మద్దతు ప్రకటించాడు. సనా ఖాన్ ప్రస్తుతం సల్మాన్ తాజా చిత్రం 'మెంటల్'లో కథానాయికగా నటిస్తోంది.
సనా సోదరుడు ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటూ మిత్రులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. వారి నుంచి తప్పించుకున్న ఆ టీనేజ్ గాళ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనను కిడ్పాప్ చేసిన వారిలో సనా కూడా ఉందని తెలిపింది. దీంతో, పోలీసులు సనాపై కేసు నమోదు చేయగా, అప్పటినుంచి ఈ 'మెంటల్' హీరోయిన్ పరారీలో ఉంది. ఈ విషయమై సల్మాన్ ట్విట్టర్లో స్పందించాడు. ఓ అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తుంది? పెళ్ళి చేసుకోవడానికా? లేక డబ్బు కోసమా?.. ఏమిటిదంతా.. వట్టి ట్రాష్.. అంటూ సనాపై ఆరోపణలను కొట్టిపారేశాడు.