: సుప్రీంను ఆశ్రయించనున్న ఆరుషి తల్లిదండ్రులు
సంచలనం సృష్టించిన టీనేజర్ ఆరుషి హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న ఆమె తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నూపుర్ తల్వార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కేసులో 14 మంది సాక్షులను మరోసారి విచారించాలంటూ వారు తమ పిటిషన్ లో కోరనున్నారు. ఇదే విషయమై అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇంతకుముందు, ఈ దంపతులు సీబీఐ ట్రయల్ కోర్టు ఆదేశాలను నేరుగా సుప్రీం కోర్టులో సవాల్ చేసి చీవాట్లు తిన్న సంగతి తెలిసిందే. అప్పుడు కూడా 14 మంది సాక్ష్యుల వాంగ్మూలం నమోదు చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలేగానీ, నేరుగా తమవద్దకు రాకూడదని సుప్రీం అక్షింతలు వేసింది. దీంతో, తల్వార్ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
2008లో నోయిడాలో ఆరుషి తన నివాసంలో హత్యకు గురైంది. ఆ మరుసటి రోజే వారి ఇంట పనిమనిషి హేమరాజ్ టెర్రస్ పై విగతజీవుడై కనిపించాడు. ఈ రెండు హత్యలు ఆరుషి తండ్రి రాజేశ్ తల్వారే చేశాడని, బయటి వ్యక్తి వారి ఇంట ప్రవేశించలేదని సీబీఐ తన విచారణలో తేల్చింది. తన కుమార్తె, పనివాడితో కామకలాపాలు సాగిస్తున్న దృశ్యం కంటబడడంతో ఆమె తండ్రే ఈ హత్యలు చేశాడని అప్పట్లో యూపీ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.