: బాలలకు రామోజీ కానుక 'బాల భారతం'
బడికి సెలవులు ప్రకటించగానే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. కారణం, ఇంట్లో చిన్నారులు చేసే అల్లరే. ఈ గొడవంతా ఎందుకని ఆ పిల్లలను తాతగారింటికో, మామ్మగారింటికో పంపడం మనం చూస్తూనే ఉంటాం. అక్కడ పెద్ధవాళ్ళు చెప్పే చిన్నచిన్న కథలు ఆ పాలుగారే పసిప్రాయులను మరో లోకాల్లో విహరిపంజేస్తాయి. వారిలో కొత్తకొత్త ఊహలకు ప్రాణం పోస్తాయి.
ఒకప్పుడు చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర, బుజ్జాయి వంటి పిల్లల పత్రికలూ ఈ బాల వికాసాన్ని సమర్థంగా నిర్వహించేవి. అద్భుతమైన జానపద కథలు, పౌరాణిక గాథలు, మెదడుకుమేతలు, చారిత్రక విషయాలు.. ఇలా ఆ పత్రికలు ప్రాపంచిక విజ్ఞాన సమాహారాల్లా భాసిల్లేవి. కాలక్రమంలో టెలివిజన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, వీడియో గేమ్స్ రంగప్రవేశంతో చిన్నారుల దృక్ఫథంలోనూ మార్పొచ్చింది.
స్పీడ్ యుగానికి వారూ అలవాటు పడిపోయారు. పట్టుమని పదినిమిషాలు నిలకడగా ఓ పుస్తకం చదివే ఓపిక వారిలో ఉండడంలేదు. పైగా, అప్పట్లో దివ్యంగా వెలిగిపో్యిన పత్రికలు కాలంతో పోటీపడలేక నిశ్శబ్దంగా నిష్క్రమించాయి. దీంతో.. పిల్లల కోసమంటూ ప్రత్యేక సాహిత్య పత్రికలు లేకుండాపోయాయి. అయితే, ఎడారిలో ఒయాసిస్ లో ఈనాడు అధినేత రామోజీరావు 'బాల భారతం' పేరిట ఓ మాసపత్రికను ప్రచురించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పత్రిక జూన్ నుంచి మార్కెట్లోకి విడుదల కానుంది. రూ.20 ఖరీదైన ఈ పుస్తకంలో ఆకట్టుకునే కథలు, పిల్లలకు బొమ్మలు గీయడంలో శిక్షణ, హాస్య గుళికలు, ముఖ్యంగా నైతిక విలువల బోధన, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, ప్రపంచ పరిశీలన వంటి విషయాలను పరిచయం చేయనున్నారు.