: కిరణ్ సర్కారు కూల్చడానికి బొత్స కుట్ర: జోగి రమేష్


కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణపై నిప్పులు చెరిగారు. కిరణ్ సర్కారును కూల్చడానికి బొత్స ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించామని శుక్రవారం బొత్స ప్రకటించిన నేపధ్యంలో రమేష్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తొమ్మిది మందిని సస్పెండ్ చేస్తే సర్కారు ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. బొత్స చర్య రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించడానికి పీసీసీ  అధ్యక్షుడు యత్నిస్తున్నారని రమేష్ ఆరోపించారు. బాధ్యతాయుత పదవిలో వున్న బొత్స ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. వాస్తవానికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎవరనే విషయంలో ఎవరికీ సందేహం లేదు.

సుజయ కృష్ణా రావు (బొబ్బిలి), ఆళ్ళ నాని (ఏలూరు), మద్దాల రాజేష్ (చింతలపూడి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు) ఇప్పటికే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసారు. గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), శివప్రసాద్ రెడ్డి (దర్శి), పేర్ని నాని (మచిలీపట్నం), చంద్రశేఖర్ రెడ్డి ( కాకినాడ సిటీ) కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీరందరూ వైఎస్సార్ కాంగ్రెస్ బాట పట్టారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అడపా దడపా కాంగ్రెస్ పార్టీపై ఇటీవల విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు రాజీనామాలపై జోగి రమేష్ తీవ్రంగా విమర్శలు చేయడంతో తొమ్మిదో ఎమ్మెల్యే ఈయనేనేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

  • Loading...

More Telugu News