: రెంట్ అడిగితే చంపేస్తా!
కిరాయి అడిగినందుకు ఇంటి యజమానిపై బెదిరింపులకు దిగాడా ప్రబుద్ధుడు. దగ్గరకొస్తే కాల్చేస్తానంటూ పిస్టల్ తో హల్ చల్ చేసాడు. దీంతో యజమాని బెదిరిపోయాడు. పోలీసులు, మీడియా రంగప్రవేశం చేస్తే వార్నీ కాల్చేస్తానన్నాడు. దీంతో మూడు గంటలు శ్రమించిన పోలీసులు అతన్ని పట్టుకుని ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలో కీల్ పాక్ ప్రాంతంలో జయశంకర్ అనే ప్రైవేటు ఉద్యోగి గత కొన్నేళ్ళుగా అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇంటియజమాని రెంట్ అడిగేందుకు వెళ్లే ప్రతీసారీ ఏదో ఒకటి చేసి తప్పించుకునేవాడు. దీంతో గత మూడేళ్లుగా రెంట్ బాకీ పడ్డాడు.
కిరాయి వసూలు చేద్దామని వెళ్ళిన ఓనర్ ను తుపాకీతో కాల్చేస్తానని, లేదా కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. పోలీసులు రంగప్రవేశం చేసినా ఇంటి తలుపులు తెరిచేది లేదంటూ రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. దీంతో చాకచక్యంగా ఇంటిలోకి ప్రవేశించి అరెస్టు చేసిన పోలీసులకు ఝలక్ ఇచ్చి కారులో దూరేసాడు. తరువాత తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. విచారించిన పోలీసులు అతనికి మతి స్థిమితం లేదని తేల్చేసారు.